బంగాళదుంపలపై మొలకలు వచ్చాక అవి తింటే.. ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్కు దారితీస్తుందని.. అందువల్ల మనిషి ప్రాణానికే ముప్పని హెచ్చరిస్తున్నారు. కాగా.. బంగాళదుంపలపై ఏర్పడే మొలకల్లో గ్లైకోఅల్కలాయిడ్స్ అనే విషపూరితమైన రసాయన పదార్థాలు ఉంటాయి. అందుకే మొలకెత్తిన బంగాళదుంపలను ఎక్కువ మోతాదులో తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. గ్లైకోఅల్కలాయిడ్స్ అనేది అనేక రసాయనాల సమూహం. ఇవి సోలనేసి కుటుంబానికి చెందినది. వివిధ రకాల మొక్కల జాతుల్లో కూడా ఇవి సహజంగా ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా వీటిని బంగాళదుంపలు, టమాటొలు, వంకాయలు, మిరియాలు వంటి ఇతర సాగు పంటల్లో కూడా గమనించవచ్చు. బంగాళదుంపలు లేదా ఆలుగడ్డలు సహజంగా సోలనైన్, చాకోనైన్ అనే రెండు గ్లైకోఅల్కలాయిడ్స్ పదార్థాలను కలిగి ఉంటాయి. ప్రధానంగా ఇవి మొలకెత్తిన దుంపల్లో అధికంగా వృద్ధి చెందుతాయి. అంతేగాక పాడైన బంగాళదుంపలు, ఆకుపచ్చ రంగులోకి మారిన బంగాళదుంపలు చేదుగా ఉంటాయి. వీటిలో హానికారపు టాక్సిన్లు ఉంటాయి. ముఖ్యంగా మొలకెత్తిన బంగాళదుంపల్లో మాత్రం అధిక స్థాయిలో ఈ రసాయన పదార్థం ఉంటుంది. బంగాళదుంపలు మొలకెత్తినప్పుడు వాటిలో గ్లైకోఅల్కలాయిడ్స్ అమాంతం పెరగడం ప్రారంభమవుతాయి. తద్వారా వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇవి తిన్న కొద్ది గంటలు లేదా ఒక్కరోజులోనే పలు అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. మొలకెత్తిన బంగాళాదుంపలలో గ్లైకోఅల్కలాయిడ్స్ అనే రసాయన పదార్థాలు అధిక స్థాయిలో ఉంటాయి. కనుక ఇవి ఎక్కువ మోతాదులో తింటే శరీరంలో విషంగా మారి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. వాంతులు, విరేచనాలు, పొత్తి కడుపులో నొప్పి రావడం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా లో-బీపీ, పల్స్ రేట్ వేగంగా కొట్టుకోవడం, జ్వరం, తలనొప్పి, మతిమరుపులతో పాటు కడుపులో నొప్పి, గుండె సంబంధిత వ్యాధులు, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మొలకెత్తిన బంగాళ దుంపలను తింటే సాధారణ మనుషులకే కాకుండా.. గర్భిణీలపై ఇంకా ప్రమాదం. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకు ముఖ్యంగా గర్భణీలు మొలకెత్తిన బంగాళదుంపలకు దూరంగా ఉండడం ఉత్తమమని అంటున్నారు.
0 Comments