ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సీబీఐ దర్యాప్తు చేస్తున్న అక్రమాస్తుల కేసుల్లో జగన్ అరెస్ట్ కాకపోవచ్చని, కూటమి ప్రభుత్వం కొత్త కేసులేమైనా పెడితే అరెస్టు అయ్యే అవకాశం ఉందని, రెండేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే జగన్‌పై అనర్హత వేటు పడుతుంది' అని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. 'ఈసారి ప్రజలు కేవలం జగన్ పోవాలనే కసితోనే ఓట్లేశారు. మరో ఆలోచన ఏదీ చేయలేదు. అందుకే జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. జగన్ చేసినవన్నీ కక్షతోనే చేశాడని మెజార్టీ ప్రజలు నమ్మారు. లిక్కర్ ధరలు పెంచడంతో సామాన్య కుటుంబాల బడ్జెట్ తారుమారైంది. అతని సంక్షేమ పథకాల కంటే లిక్కర్ భారమైంది. అది జగన్ కొంప ముంచిందన్నారు. ఎందుకు ఓడిపోయామనే దానిపై జగన్ సమీక్ష చేసుకోవాలన్నారు. ఇవాళ మోడీ భవిష్యత్ చంద్రబాబు, నితీశ్‌కుమార్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. కేంద్రంలో ఎన్‌డీఏ, ఇండియా కూటమికి కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే తేడా అని, ఈ అవకాశాన్ని చంద్రబాబు ఉపయోగించుకోవాలి. ప్రత్యేక హోదా, పోలవరం, అమరావతి వంటి వాటితో పాటు ఇతర విభజన అంశాలన్నీ సాధించుకునే అవకాశం వచ్చింది' అని ఉండవల్లి అన్నారు.
0 Comments