మహిళా వైద్యాధికారులను లైంగికంగా వేధించినట్టు తేలడంతో కామారెడ్డి జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) లక్ష్మణ్‌సింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో లక్ష్మణ్‌సింగ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలోనే జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌నాయక్‌పై కూడా ఓ కేసు నమోదైంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణ చేయాల్సిన డీఎంహెచ్‌వో అనుచితంగా ప్రవర్తించడంతో దుమారం చెలరేగింది. ఈ నెల 8న జిల్లా కేంద్రంలో జరిగిన ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశంలో ఈ విషయం వెలుగు చూసింది. అందులో డీఎంహెచ్‌వో తమతో అసభ్యంగా మాట్లాడారని కొందరు మహిళా వైద్యాధికారులు ఆరోపించారు. తర్వాత రోజు వారు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో మొదట ఐదుగురు, ఆ తర్వాత ఇద్దరు మహిళా వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎంహెచ్‌వోపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఏడు కేసులు నమోదయ్యాయి.
0 Comments