Saturday, October 17, 2026

స్వతంత్ర వ్యవస్థల విధుల్లో కేంద్రం జోక్యం ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు : మహేష్ కుమార్‌ గౌడ్‌ హెచ్చరిక

హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థలో అవలంబించాల్సిన ప్రాథమిక నిబంధనలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. 'ఎవరైనా వ్యక్తి మరణిస్తే ఓటు తొలగించాలి,  వేరే ప్రాంతానికి బదిలీ అయితే ఓటు మార్పిడి జరగాలి. కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి నచ్చని ఓట్లను ఏకపక్షంగా తోలిగించే కుట్ర జరుగుతోంది' అని విమర్శించారు. ఇన్నాళ్లూ ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించిన బీజేపీ, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. ముఖ్యంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియలో తెచ్చిన మార్పులను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సీఈసీ ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర వ్యవస్థల విధుల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని హెచ్చరించారు.