Sunday, October 18, 2026

మహారాష్ట్రలో పెద్ద పులికి బలైన మహిళ, చిరుత దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో వన్యప్రాణుల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. వేర్వేరు ఘటనల్లో పులి దాడిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, చిరుత దాడిలో హైదరాబాద్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. చంద్రాపూర్ జిల్లా చిమూర్ తాలూకాలోని పళాస్‌గావ్ అటవీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉషా గురునులే (45) అనే మహిళ తన భర్తతో కలిసి వరి పొలంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా పులి దాడి చేసింది. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భార్యపై పులి దాడి చేయడాన్ని చూసిన భర్త ఆమెను కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ భార్యను కాపాడలేకపోయాడు. భర్త కళ్ల ముందే ఆమె ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతాల్లో పులుల సంచారం, ప్రజల భద్రతపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరో ఘటనలో హైదరాబాద్‌కు చెందిన కార్తిక్ జాదవ్ (9) అనే బాలుడిపై చిరుతపులి దాడి చేసింది. దసరా సెలవుల సందర్భంగా చంద్రాపూర్ జిల్లా బల్లార్షాలోని తన మేనత్త ఇంటికి వచ్చాడు తొమ్మిదేళ్ల కార్తిక్. కుటుంబ సభ్యులతో కలిసి నవరాత్రుల సందర్భంగా చంద్రాపూర్‌లోని మహాకాళి ఆలయానికి కాలినడకన వెళ్తున్నాడు. ఈ క్రమంలో బల్లార్షా-చంద్రాపూర్ రహదారిపై విసాపూర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో చిరుత ఒక్కసారిగా బాలుడిపై దాడి చేసింది. అనంతరం అతడిని సమీపంలోని బొటానికల్ గార్డెన్‌లోకి లాక్కెళ్లింది. బాలుడి అరుపులు విన్న స్థానికులు కేకలు వేస్తూ, కర్రలతో చిరుతను తరిమేందుకు ప్రయత్నించారు. దీంతో బాలుడిని వదిలేసి చిరుత అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు గంటపాటు వెతికిన అనంతరం బొటానికల్ గార్డెన్ అవుట్‌గేట్ సమీపంలో తీవ్ర గాయాలతో ఉన్న బాలుడిని గుర్తించారు. వెంటనే అతడిని చంద్రాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి చికిత్స కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.