Friday, October 16, 2026

గుడ్‌నెస్‌ క్రెడిట్‌ కోర్సును ప్రవేశ పెట్టిన ఐఐటీ హైదరాబాద్‌

ఐఐటీ హైదరాబాద్‌ మంచి జీవన విధానం అంటే ఏమిటి ? ఆదాయ, హోదాకు అతీతంగా విజయాన్ని ఎలా అందుకోవాలి వంటి అంశాలను బోధించే గుడ్‌నెస్‌పై క్రెడిట్‌ కోర్స్‌ను ప్రవేశపెట్టింది. దేశంలోనే మొట్టమొదటి ఈ క్రెడిట్‌ కోర్సులో అండర్‌ గ్రాడ్యుయేట్‌ చదువుతున్న 140 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు ఐఐటీహెచ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. రోజువారీ దినచర్యలో మంచితనాన్ని ఎలా ఆచరించవచ్చు.. తదితర అంశాలను ఈ కోర్సులో బోధిస్తారు. విద్యా, వృత్తిపరమైన నైపుణ్యాలకు అతీతంగా విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదల, బాధ్యత తదితర అంశాలు ఉంటాయి. మంచితనాన్ని అర్థం చేసుకోవడం నుంచి దానిని ఆచరించేలా.. మరింత బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మారేలా విద్యార్థులను నడిపించడం ఈ కోర్సు లక్ష్యమని.. తాము ఎలాంటి భారతదేశాన్ని నిర్మించడంలో సహాయపడాలనుకుంటున్నారో అనే దానిపై ఓ ఆలోచనతో ఈ కోర్సు ముగుస్తుందని పేర్కొన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గుడ్‌నెస్‌ వ్యవస్థాపకుడు, ఐఐటీ రూర్కీ పూర్వ విద్యార్థి రవి శర్మ ఈ కోర్సును బోధిస్తారు.