Saturday, October 17, 2026

రేపు ట్యాంక్‌బండ్‌పై పెద్ద బతుకమ్మ వేడుకలు : మహిళలంతా వేడుకల్లో పాల్గొనాలని మంత్రి సీతక్క ఆహ్వానం

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వం నిర్వహిస్తున్న పెద్ద బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాలని మహిళలందరికీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ ఆహ్వానం పలికారు. ఆడపడుచులందరికీ పేరుపేరునా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది ఒక పండుగేకాక తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని, ప్రజల జీవన విధానాన్ని, తరతరాలుగా కొనసాగుతున్న వారసత్వ సంపదను చాటిచెప్పే అరుదైన సాంస్కృతిక వేడుక అని అన్నారు. పూలతో చెరువులను శుద్ధి చేసుకుంటూ, ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే పండుగ బతుకమ్మ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సాధారణంగా పూలతో దేవుళ్లను పూజిస్తామని, కానీ పూలనే దేవతలుగా భావించి పూజించే ప్రత్యేకమైన సంప్రదాయం బతుకమ్మ పండుగలో కనిపిస్తుందని వివరించారు. నవధాన్యాలను ప్రసాదాలుగా పంచుకుంటూ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే సంప్రదాయం ఈ పండుగలో అంతర్భాగమన్నారు. ఆత్మీయత, అనురాగాలను కలబోసుకుని, కష్టసుఖాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ మహిళలంతా కలిసిమెలిసి జరుపుకునే పండుగ బతుకమ్మ అని సీతక్క తెలిపారు. ఈ వేడుక మహిళల్లో ఐక్యతను, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుందన్నారు. తరతరాలుగా మహిళలు తమ సంస్కృతిని, సంప్రదాయాలను తరువాతి తరాలకు అందిస్తున్నారని, బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ప్రత్యేకతకు, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని వివరించారు. తొమ్మిది రోజులపాటు సాగే ఈ వేడుకల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మను ఆదివారం ఘనంగా జరుపుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పెద్ద బతుకమ్మ వేడుకలకు హైదరాబాద్‌లోని మహిళలందరూ తరలిరావాలని, పూల పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆహ్వానించారు.