Wednesday, October 14, 2026

అనుమానంతో భార్యను గొంతు కోసి చంపిన భర్త

హైదరాబాద్ లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం, అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. వివాహం జరిగి పదిహేనేళ్లు గడిచినా, కట్టుకున్న భార్యపై పెంచుకున్న అనుమానంతో ఓ భర్త కసాయిగా మారి ఆమెను అత్యంత దారుణంగా చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినజ్‌పూర్ జిల్లాకు చెందిన మహమ్మద్ ముస్తఫా, అజ్మీరా బేగం (29) భార్యాభర్తలు. బతుకుదెరువు కోసం కొద్ది సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చి బాలాపూర్‌లోని న్యూ బాబా నగర్‌లో నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి వీరిద్దరి మధ్య వ్యక్తిగత విషయాలపై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ముస్తఫా, కోపోద్రిక్తుడై అజ్మీరా బేగం గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మృతభాగాన్ని గమనించిన నిందితుడు, వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం బాలాపూర్‌లోని ఓ హోటల్‌లో తలదాచుకున్న ముస్తఫాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా అతను నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధంతో పాటు నిందితుడి సెల్ ఫోన్, రక్తపు మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భారతీయన్యాయ సంహిత సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు బాలాపూర్ పోలీసులు తెలిపారు.