యాదగిరిగుట్ట పుష్కరిణిలో ప్రమాదవశాత్తు పడి చిన్నారి దుర్మరణం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పుష్కరిణిలో పడి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లోని బడంగ్‌పేట ప్రాంతానికి చెందిన శివలింగం ఆద్య (4)  నిన్న సాయంత్రం ఈ ప్రమాదానికి గురై మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం బడంగ్‌పేటకు చెందిన ప్రవీణ్ కుమార్, సంతోష దంపతులు తమ పిల్లలతో కలిసి యాదగిరిగుట్టకు వచ్చారు. కొండ కింద ఉన్న కల్యాణకట్ట సమీపంలోని పుష్కరిణి వద్ద కుటుంబ సభ్యులు స్నానం చేస్తుండగా, చిన్నారి ఆద్య మెట్లపై ఆడుకుంటోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి లోతైన నీటిలో పడిపోయింది. చిన్నారి నీటిలో పడిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, అక్కడున్న ఇతర భక్తులు వెంటనే స్పందించి ఆమెను బయటకు తీశారు. ప్రథమ చికిత్స నిమిత్తం చిన్నారిని తక్షణమే బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారిని పరీక్షించిన వైద్యులు, ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో స్వామివారి దర్శనం కోసం వచ్చిన కుటుంబంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై యాదగిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం చిన్నారి మృతదేహాన్ని గురువారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పుష్కరిణిల వద్దకు వెళ్లే సమయంలో చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, నీటి అంచుల వద్ద పర్యవేక్షణ తప్పనిసరి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


إرسال تعليق

أحدث أقدم
3