భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే కాదు. ప్రపంచ ఆర్థిక రంగంలోనే మునుపెన్నడూ చూడని విప్లవాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన 'జియో ప్లాట్ఫార్మ్స్' ఐపీఓ పెట్టుబడిదారుల ఆదరణతో ప్రపంచ రికార్డులను తిరగరాసింది. బిడ్డింగ్ ముగియడానికి మరో ఐదు గంటల సమయం ఉండగానే, ఈ ఐపీఓ ఏకంగా 1 కోటి దరఖాస్తుల మైలురాయిని దాటి సరికొత్త సరిహద్దులను సృష్టించింది. ధీరూభాయ్ అంబానీ ఆశయాలకు అనుగుణంగా ముకేశ్ అంబానీ దూరదృష్టితో కోట్లాది మంది సామాన్య భారతీయులకు సంపద సృష్టిని అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ ప్రయాణానికి పెట్టుబడిదారులు బ్రహ్మరథం పట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఐపీఓ చరిత్రలోనే ఏకంగా 1 కోటి మందికి పైగా ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకున్న ఏకైక ఐపీఓగా జియో ప్లాట్ఫార్మ్స్ నిలిచింది. ఇప్పటివరకు అత్యధికంగా దాదాపు 97 లక్షల దరఖాస్తులతో 'వారీ ఎనర్జీస్' పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జియో ప్లాట్ఫార్మ్స్ తిరగరాసింది. గతంలో భారత్‌లో రికార్డు సృష్టించిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, బిసిసిఎల్ వంటి సంస్థలు సాధించిన 90 లక్షల దరఖాస్తుల రికార్డులను కూడా జియో సునాయాసంగా అధిగమించింది. ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు బిడ్డింగ్ దాఖలు చేసే అవకాశం ఉండటంతో అంతిమ దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగి సరికొత్త ఎత్తులకు చేరే అవకాశం ఉంది. సామాన్య రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి దిగ్గజ సంస్థాగత పెట్టుబడిదారుల వరకు జియో ప్లాట్ఫార్మ్స్ భవిష్యత్తు మరియు సాంకేతిక ప్రగతిపై చూపిన అపారమైన నమ్మకానికి ఈ అపూర్వ స్పందనే నిదర్శనమని మార్కెట్ విశ్లేషకులు కొనియాడుతున్నారు.
