Tuesday, October 13, 2026

పాకిస్తాన్‌ లో పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు : ఆరుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

పాకిస్తాన్‌ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న రెహ్మాన్ బాబా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కరాచీ సిటీ నుంచి పెషావర్ వెళ్తున్న రెహ్మాన్ బాబా ఎక్స్‌ప్రెస్ పంజాబ్ ప్రావిన్స్‌లోని షేర్ షా ప్రాంతంలో ఇవాళ ఉదయం పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రైలు బోగీలు పక్కకు ఒరిగిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. అయితే, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది, రైల్వే అధికారులు హుటాహుటిన స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే ముల్తాన్‌లోని నిష్తర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.