అనివార్య కారణాల వల్ల రద్దైన అమిత్ షా తెలంగాణ పర్యటన
Saturday, October 3, 2026
Amit Shah's Telangana Visit Cancelled Due to Unavoidable Circumstances Karimnagar districts national participate in various key development and educational programs in the Medak
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన అనివార్య కారణాలతో రద్దయింది. షెడ్యూల్ ప్రకారం ఆయన హైదరాబాద్ చేరుకుని, మరుసటి రోజు మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలు కీలక అభివృద్ధి, విద్యా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు స్వయంగా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించి సర్వం సిద్ధం చేసిన తరుణంలో, ఢిల్లీలోని అత్యవసర అధికారిక సమీక్షలు, ఇతర పరిణామాలతో ఈ పర్యటన రద్దుఅయింది. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా ముందుగా మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలో అమూల్, సబర్ డెయిరీ భారీ మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, స్థానిక పాడి రైతులతో మాట్లాడాల్సి ఉంది. అనంతరం మధ్యాహ్నం కరీంనగర్‌లోని నాగునూరులో ఉన్న ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. సంస్థ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో పాల్గొని, ప్రతిమ డీమ్డ్ యూనివర్సిటీ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేయాల్సి ఉంది. 25 ఏళ్ల క్రితం ఇదే వైద్య కళాశాలను నాటి కేంద్ర హోంమంత్రి ఎల్.కె. అద్వానీ ప్రారంభించారు. సరిగ్గా పాతికేళ్ల తర్వాత మళ్లీ ప్రస్తుత కేంద్ర హోంమంత్రి హోదాలో అమిత్ షా రానుండటంతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలతో పాటు, పర్యటన ముగింపులో హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా కీలక అంతర్గత సమీక్ష నిర్వహించనున్నట్లు ప్రచారం జరిగింది. త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలు , రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుసరించాల్సిన కార్యాచరణపై రాష్ట్ర నాయకత్వానికి ఆయన దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు భావించాయి.
No comments:
Post a Comment