పనామాలో భారీ భూకంపం : రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.7గా నమోదు
పనామా దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.7గా నమోదైంది. భూప్రకంపనల ధాటికి పనామా సిటీ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాలు, షాపింగ్ మాల్స్‌లో ఉన్నవారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అమెరికా జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం పనామాలోని హెర్రెరా ప్రావిన్స్‌లో పిటాలోజా అర్రిబా సమీపంలో భూకంప కేంద్రం నమోదైనట్లు తెలుస్తోంది. భూమికి సుమారు 12.6 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భూకంపం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో భవనాలు, రహదారులు దెబ్బతిన్నట్లు తెలిసింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఏం జరుగుతుందో అర్థంకాక ఆందోళనకు గురయ్యారు. షాపింగ్ మాల్స్‌లో ఉన్నవారు సైతం బయటకు పరుగులు తీశారు. పనామా సిటీలోని టౌన్ సెంటర్ మాల్ నుంచి ప్రజలు బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పలు చోట్ల ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో జనమంతా గుమిగూడారు. భూకంపం తర్వాత 40కి పైగా ప్రకంపనలు నమోదైనట్లు తెలుస్తోంది. వరుస ప్రకంపనలతో ప్రజల్లో భయం మరింత పెరిగింది. భూకంపం తర్వాత కూడా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉండటంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. భవనాలకు జరిగిన నష్టం, ఇతర ప్రాంతాలపై ప్రభావం, సహాయక చర్యల పురోగతిపై స్పష్టమైన వివరాలు తెలియాల్సి ఉంది. భూకంప తీవ్రతను తొలుత 8.0గా అంచనా వేయగా ఆ తర్వాత 7.7గా సవరించినట్లు తెలుస్తోంది.

Post a Comment