పాతకాలపు లుక్‌, కొత్త ఫీచర్స్ తో డుకాటీ ఫార్ములా 73 విడుదల : ప్రపంచవ్యాప్తంగా కేవలం 873 బైక్‌లు మాత్రమే తయారు

దేశీయ మార్కెట్‌లో డుకాటీ కొత్త మోడల్‌ ఫార్ములా 73ను విడుదల చేసింది. 1973లో వచ్చిన డుకాటీ 750 సూపర్‌ స్పోర్ట్‌ డెస్మో బైక్‌ స్ఫూర్తితో దీన్ని రూపొందించింది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.20 లక్షలు. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కేవలం 873 బైక్‌లను మాత్రమే తయారు చేయనుండగా, భారత్‌కు కేటాయించిన అన్ని యూనిట్లు ఇప్పటికే బుక్‌ అయిపోయినట్లు సమాచారం. ఈ బైక్‌ను చూస్తే పాతకాలపు రేసింగ్‌ బైక్‌లు గుర్తుకొస్తాయి. సిల్వర్, ఆక్వా గ్రీన్‌ రంగుల కలయికతో ఫ్యూయల్‌ ట్యాంక్‌పై బంగారు రంగు గీతను ఇచ్చారు. క్లిప్‌-ఆన్‌ హ్యాండిల్‌బార్లు, బార్‌-ఎండ్‌ మిర్రర్లు, చిన్న ఫెయిరింగ్‌, వెనుకవైపు సన్నగా ఉండే సీటు డిజైన్‌ దీనికి కేఫ్‌ రేసర్‌ లుక్‌ను ఇస్తాయి. ఈ డిజైన్‌ వెనుక డుకాటీ రేసింగ్‌ చరిత్ర ఉంది. 1972లో జరిగిన ఇమోలా రేసులో విజయం సాధించిన 750 ఇమోలా డెస్మో బైక్‌ నుంచి ఈ మోడల్‌కు స్ఫూర్తి లభించింది. ఇందులో 803సీసీ డెస్మోడ్యూ ఎల్‌-ట్విన్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 73 హెచ్‌పీ పవర్‌, 65.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన టెర్మిగ్నోని ఎగ్జాస్ట్‌ను కూడా అందించారు. స్టీల్‌ ట్రెలిస్‌ ఫ్రేమ్‌, ముందు భాగంలో 41 మి.మీ. కైవైబీ అప్‌సైడ్‌-డౌన్‌ ఫోర్క్‌, వెనుక ప్రీలోడ్‌ అడ్జస్టబుల్ మోనోషాక్‌ సస్పెన్షన్‌ ఉన్నాయి. పాతకాలపు లుక్‌ ఉన్నప్పటికీ, కొత్త ఫీచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. కార్నరింగ్‌ ఏబీఎస్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, క్విక్‌షిఫ్టర్‌, రెండు రైడింగ్‌ మోడ్‌లు ఇందులో ఉన్నాయి. 4.3 ఇంచెస్ టీఎఫ్‌టీ స్క్రీన్‌, ఫుల్లీ ఎల్‌ఈడీ లైటింగ్‌ సిస్టం కూడా ఉన్నాయి. అవసరమైతే హీటెడ్‌ గ్రిప్స్‌, టర్న్‌-బై-టర్న్‌ నావిగేషన్‌ను అదనపు యాక్సెసరీలుగా పొందవచ్చు. అంటే.. క్లాసిక్‌ డిజైన్‌తో పాటు ప్రస్తుత కాలానికి అవసరమైన టెక్నాలజీని కూడా ఇందులో పొందుపరిచారు.

إرسال تعليق

أحدث أقدم
3