ホーム
/
VB-G Ramji
/
వీబీ- జీ రామ్ జీ : 15 రోజుల్లోనే కొత్త జాబ్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశం
Sunday, October 4, 2026
government has already declared 265 mandals across 18 districts as drought-affected areas Telangana Government Orders Issuance of New Job Cards Within 15 Days VB-G Ramji
తెలంగాణలో ఉపాధి హామీ పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి 15 రోజుల్లో జాబ్‌కార్డులు జారీ చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం శనివారం నాడు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో ఇప్పటికే 18 జిల్లాల పరిధిలోని 265 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. సాగు విస్తీర్ణం పడిపోవడంతో వ్యవసాయ పనులపై ఆధారపడి జీవించే కూలీలు ఉపాధి కోల్పోయి ఆదాయాన్ని నష్టపోయే దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించడానికి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రతి గ్రామంలోనూ ఉపాధి అవసరమున్న కుటుంబాలను గుర్తించి, ప్రతి రోజు 100 నుంచి 150 మందికి ఉపాధి పనులు కల్పించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 52.46 లక్షల కుటుంబాలకు చెందిన 1.08 కోట్ల మందికి పైగా జాబ్‌కార్డులు కలిగి ఉన్నారు. వీరికి తోడుగా కరవు ప్రభావిత ప్రాంతాల్లో కొత్తగా ఉపాధి కోరుకునే వారు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. 18 ఏళ్లు నిండిన గ్రామీణులు తమ ఆధార్ కార్డు, ఫొటోతో కూడిన దరఖాస్తును గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమర్పించాలి. కార్యదర్శి పరిశీలన తరువాత మండల స్థాయిలో ఎంపీడీవో అర్హతను నిర్ధారించి జాబ్‌కార్డు జారీ చేస్తారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి కేవలం 15 రోజుల్లోనే కొత్త కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ పనులు లేని ఈ సంక్షోభ సమయంలో గ్రామీణ కుటుంబాలకు ఉపాధి హామీ పనులు భరోసానిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
No comments:
Post a Comment