కల్తీ నెయ్యి స్కాం కేసు : బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీవైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ సంస్థల రూ.130 కోట్ల ఆస్తులు జప్తు

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదాల తయారీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కీలక నిర్ణయం తీసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ అధికారులు ఈ భారీ మోసానికి పాల్పడిన బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీవైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ సంస్థలకు చెందిన సుమారు రూ.130 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నిందితులు టీటీడీ టెండర్లను దక్కించుకునేందుకు పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించారు. నిబంధనల ప్రకారం అర్హత లేకపోయినా బినామీ సంస్థలను అడ్డం పెట్టుకుని, ఏకంగా రూ.234 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని బోలేబాబా డెయిరీ నేరుగా తిరుమలకు సరఫరా చేసినట్లు ఈడీ గుర్తించింది. అసలు ఆ సంస్థ ప్రాంగణాల్లో వాస్తవంగా పాల సేకరణ, నెయ్యి ఉత్పత్తి రికార్డులేవీ లేవని.. ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేసిన కెమికల్స్, పామాయిల్, చేప నూనె, ఇతర రసాయనాలను కలిపి కృత్రిమంగా నెయ్యిని తయారు చేసి పవిత్ర తిరుమల ఆలయానికి పంపినట్లు విచారణలో బట్టబయలైంది. ఈ నెయ్యి సరఫరా వెనుక భారీ అంతర్రాష్ట్ర రాకెట్ పనిచేసినట్లు ఈడీ నిర్ధారించింది. బోలేబాబా సంస్థ తయారు చేసిన కల్తీ నెయ్యిని టీటీడీకి చేరవేసేందుకు శ్రీవైష్ణవి డెయిరీ సహా ఇతర అనుబంధ కంపెనీలను ఫ్రంట్ ఎంటిటీస్ గా వాడుకున్నారు. టీటీడీ నుంచి విడుదలైన వందలాది కోట్ల రూపాయల నిధులను నేరుగా ఒకే ఖాతాలో ఉంచకుండా.. డమ్మీ కంపెనీలు, రౌండ్ ట్రిప్పింగ్ పద్ధతుల ద్వారా పలు ఖాతాల్లోకి మళ్లించి, ఆ మొత్తంతో ఉత్తరాఖండ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో భారీగా భూములు, భవనాలు, ప్లాంట్లు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ అక్రమ ధనార్జనతో కూడబెట్టిన ఆస్తులనే తాజాగా పీఎంఎల్ఏ కింద జప్తు చేశారు. ఈడీతో పాటు సీబీఐ నేతృత్వంలోని సిట్ ఇప్పటికే సమర్పించిన చార్జిషీట్లలోనూ ఈ సింథటిక్ నెయ్యి కుంభకోణం విలువ రూ.230 కోట్ల నుంచి రూ.250 కోట్ల మేర ఉన్నట్లు తేలింది. ఇప్పటికే సుకృతి ఫుడ్స్ ప్రమోటర్‌తో పాటు పలువురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థలు.. టీటీడీ అంతర్గత అధికారులు, కొనుగోళ్ల విభాగంలో సహకరించిన వారి పాత్రపై మరింత లోతుగా కూపీ లాగుతున్నాయి. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాలను సైతం వ్యాపార సరుకుగా మార్చి కోట్లు కొల్లగొట్టిన డెయిరీ యజమానులు, సహకరించిన బడా బాబులపై త్వరలోనే మరిన్ని కఠిన చర్యలు, అదనపు ఆస్తుల జప్తులు ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది.

Written By

Amateur Full-Stack Developers and Full-Stack UI Designer • Powered by love and coffee • Portofolio on dribbble.com/sanengineer