తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో కేసీఆర్ కుటుంబ సభ్యుల భూములపై సంచలన ఆరోపణలు చేసారు. వీటిపై  కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తాను అమెరికాలో చదువుకొని, ఉద్యోగం చేసిన డబ్బుతో భూములు కొనుక్కుంటే రేవంత్ రెడ్డి అవన్నీ అక్రమంగా రాయించుకున్న భూములని చెప్పడంపై సెటైర్ వేశారు. గోడలపై రాతలు రాసుకున్న నీకు.. జూబ్లిహిల్స్ లో ప్యాలెస్, నీ తమ్ముళ్లకు ఏరో స్పెస్ కంపెనీలు ఎలా వచ్చాయో చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బాబాయి ఎందుకు చనిపోయాడో చెప్పాలని కేటీఆర్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దళితులు మీద ఎక్కడలేని కురిపిస్తున్నారని, ఒక దశలో అయితే ఎమోషనల్ అయిపోయి ప్రసాద్ గారినో, భట్టి గారినో శాసన సభలో ముఖ్యమంత్రిగా ప్రకటిస్తాడని అనుకున్నా నని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజంగా దళితుల పైన ప్రేమ ఉంటే దళిత డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాలన్నారు. అదే విధంగా కేసీఆర్ దళిత బంధు రూ.10 లక్షలు ఇస్తాను అంటే రూ.12 లక్షలు ఇస్తానని కోతలు కోసారని ఆరోపించారు. ఇలాంటివి ఏమీ చేయకుండా నోటికి వచ్చినట్లు శిఖర సమానుడైన కేసీఆర్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ప్లాప్ అయిన సినిమాకు శతజయంతి వేడుకలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవా చేశారు. తన తండ్రి ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తి, భూముల వివరాలను పొందుపర్చారని చెప్పారు. వాటిని ఒకసారి చూసుకొని మాట్లాడాలని హెచ్చరించారు. కేవలం డిగ్రీ మాత్రమే చదివిన రేవంత్ రెడ్డికి ఇన్నీ వేల ఎకరాల భూమి, ఆస్తులు, కుటుంబ సభ్యుల పేరుతో కంపెనీలు ఎలా వచ్చాయో చెప్పగలరా అంటూ కేటీఆర్ ప్రతిదాడికి దిగారు . తమ పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

Post a Comment

Previous Post Next Post