విజయవాడ నగరంలో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కేవలం మూడు గంటల వ్యవధిలోనే పడిన కుండపోత వర్షానికి బెజవాడ చిగురుటాకులా వణికిపోయింది. అకస్మాత్తుగా ముంచెత్తిన ఈ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా బస్టాండ్ సమీపంలోని వంతెన వద్ద రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. ఈ నీటిలో ఒక ఆర్టీసీ బస్సు చిక్కుకుని పూర్తిగా మునిగిపోవడం వర్షం తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దుర్గగుడి ఘాట్ రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో పాటు కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో భద్రతా చర్యల్లో భాగంగా దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. దుర్గగుడి పరిసర ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు, వాహనదారులు గంటల తరబడి నానా తంటాలు పడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయని లోతట్టు కాలనీల్లోకి వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు నిత్యావసర సరుకులు కోల్పోయి నానా అవస్థలు పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ , విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై నిలిచిన నీటిని మోటార్ల ద్వారా బయటకు తోడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

Post a Comment

أحدث أقدم