విదేశీ విద్యార్థులు, జర్నలిస్టుల వీసా కాలపరిమితి నిబంధనలు : తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా ఫెడరల్ కోర్టు

విదేశీ విద్యార్థులు, జర్నలిస్టుల వీసాల కాలపరిమితిపై ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనలను అమెరికా ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. మంగళవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రావాల్సి ఉండగా, ఒక్కరోజు ముందే మసాచుసెట్స్ జిల్లా న్యాయమూర్తి ఎఫ్. డెన్నిస్ ప్రాథమిక స్టే విధించారు. దీంతో భారత్ సహా పలు దేశాల నుంచి అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు ఊరట లభించింది. కొత్త నిబంధనలు అమెరికాలో విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ సందర్శకుల వీసాలను గరిష్ఠంగా నాలుగేళ్లకు, జర్నలిస్టుల వీసాలను 240 రోజులకు పరిమితం చేయాలని ప్రతిపాదించాయి. చైనా జర్నలిస్టులకు మాత్రం 90 రోజుల పరిమితి విధించారు. గడువు పొడిగింపునకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ దానిని ఆమోదించే అధికారం హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారుల విచక్షణకు వదిలారు. తిరస్కరణపై అప్పీల్‌కు అవకాశం లేకపోవడం కూడా నిబంధనల్లో ఉంది. ఈ విధానం అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఉన్నత విద్యా రంగానికి విపత్తు స్థాయి నష్టం కలిగించే అవకాశం ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దాదాపు 600 ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఉపశమనాన్ని కేవలం పిటిషనర్లకే పరిమితం చేయాలన్న ప్రభుత్వ వాదనను కూడా న్యాయమూర్తి తిరస్కరించారు. వీసా మోసాలను అరికట్టడం, గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉండిపోయేవారిని గుర్తించడం సులభతరం చేయడమే కొత్త పరిమితుల ఉద్దేశమని ప్రభుత్వం వాదించింది. అయితే ప్రభుత్వాన్ని విమర్శించే విదేశీ జర్నలిస్టుల వీసా పునరుద్ధరణను అధికారులు నిరాకరించే స్పష్టమైన అవకాశముంది అని న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త నిబంధనల అసలు ఉద్దేశం జాతీయ భద్రత కంటే విద్యాసంస్థలు, మీడియాపై ప్రభుత్వ నియంత్రణ పెంచడమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని తీర్పులో పేర్కొన్నారు.

Post a Comment

0 Comments