ఏఆర్ రెహమాన్ వెండితెరకి పరిచయం కాబోతున్నారు. ప్రభుదేవాతో కలిసి పనిచేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మూన్‌వాక్'. వినోదం, నృత్యం, సంగీతం కలగలిపిన ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. మనోజ్ ఎన్.ఎస్. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బిహైండ్‌వుడ్స్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడమే కాకుండా, తన సినీ కెరీర్‌లోనే తొలిసారిగా వెండితెరపై ఒక ప్రత్యేక అతిథి (క్యామియో) పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు, స్టార్ కమెడియన్ యోగిబాబు ఈ చిత్రంలో ఏకంగా 16 విభిన్న పాత్రలు పోషిస్తుండటం విశేషం. అజు వర్గీస్, అర్జున్ అశోకన్, నిష్మా, సుస్మిత, రెడ్డిన్ కింగ్స్‌లీ, మొట్టై రాజేంద్రన్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఆస్వాదించేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని దర్శకుడు మనోజ్ వెల్లడించారు. "దీపావళి పండుగ కుటుంబాల మధ్య అనుబంధాన్ని, సంతోషాన్ని పంచుతుంది. మా 'మూన్‌వాక్' సినిమా కూడా నవ్వులు, నాట్యం, అద్భుతమైన సంగీతంతో ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుంది" అని ఆయన వివరించారు. ఇప్పటికే లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైన 'యేతు', 'టింగా', 'మకరీనా' పాటలకు శ్రోతల నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ లభించింది. త్వరలో ప్రభుదేవా, ఏఆర్ రెహమాన్ కలిసి తెరపై స్టెప్పులేయనున్న 'మయిలే' అనే నాలుగో గీతాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అనూప్ వి. శైలజ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్త పంపిణీ హక్కులను 'రోమియో పిక్చర్స్' సొంతం చేసుకుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది.
إرسال تعليق