వ్యాపారవేత్త విజయ్ మాల్యా రుణాలు రికవరీ అయినంత మాత్రాన ఆయనపై ఉన్న మనీలాండరింగ్ క్రిమినల్ కేసులు రద్దవ్వవని, విచారణ కొనసాగుతూనే ఉంటుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బాంబే హైకోర్టుకు స్పష్టం చేసింది. విజయ్ మాల్యాకు చెందిన ఆస్తులను విక్రయించడం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం భారీగా రుణాలను రికవరీ చేసుకుంది. దీంతో బ్యాంకులతో వివాదం తీరిపోయిందని, రుణాలు చెల్లించినందున తనపై నమోదైన క్రిమినల్ కేసులన్నింటినీ మూసివేయాలని కోరుతూ మాల్యా 2020లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా ఈడీ అఫిడవిట్ సమర్పిస్తూ ఆయన వాదనను పూర్తిగా వ్యతిరేకించింది. మాల్యాకు చెందిన UBHL షేర్లు, ఇతర స్థిర, చరాస్తులతో కలిపి రూ. 14,131.16 కోట్ల విలువైన ఆస్తులను ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు అప్పగించినట్లు ఈడీ తెలిపింది. ఆస్తులను వేలం వేసి డబ్బులు వసూలు చేసుకోవడం అనేది బ్యాంకులకు జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రక్రియ మాత్రమేనని, దానివల్ల చేసిన మనీలాండరింగ్ నేరం మాయమైపోదని ఈడీ వెల్లడించింది. 2016 మార్చిలో దేశం విడిచి పారిపోయిన మాల్యా, ఎన్నోసార్లు సమన్లు జారీ చేసినా విచారణకు హాజరుకాలేదని, నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా భారత న్యాయస్థానాలను ఎదుర్కోవడానికి ముందుకు రావడం లేదని గుర్తుచేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు ఇవ్వడం ఒక చట్టబద్ధమైన విధానమని, బ్యాంకులు తమ డబ్బు పొందినంత మాత్రాన క్రిమినల్ విచారణ ముగియదని తేల్చిచెప్పింది. మూతపడిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం వివిధ బ్యాంకుల నుంచి మాల్యా సుమారు రూ. 9,000 కోట్ల రుణాలు తీసుకున్నారు. అందులో కనీసం రూ. 3,500 కోట్లను మనీలాండరింగ్ ద్వారా ఇతర అవసరాలకు మళ్లించి దుర్వినియోగం చేశారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. 2016లో మాల్యా ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ, 2019లో ప్రత్యేక కోర్టు అనుమతితో ఆ ఆస్తులను బ్యాంకుల రికవరీకి కేటాయించింది. ప్రస్తుతం కోర్టు విచారణను ఎదుర్కొనేందుకు భారత్‌కు తిరిగి వస్తారా అని హైకోర్టు ప్రశ్నించినప్పటికీ మాల్యా నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం రాలేదని ఈడీ పేర్కొంది. దీంతో రుణాల రికవరీతో కేసు మూసివేయించుకుందామనుకున్న విజయ్ మాల్యా ప్లాన్‌కు ఈడీ గట్టి బ్రేక్ వేసింది.
విజయ్ మాల్యా రుణాలు రికవరీ అయినంత మాత్రాన మనీలాండరింగ్ క్రిమినల్ కేసులు రద్దవ్వవు : బాంబే హైకోర్టుకు స్పష్టం చేసిన ఈడీ
السبت، 12 سبتمبر 2026
business ED clarifies to Bombay High Court national Recovery of Vijay Mallya's loans does not quash money laundering criminal cases
ليست هناك تعليقات:
إرسال تعليق