బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన అధికారిక గాలా డిన్నర్ మెనూ ప్రస్తుతం రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. ప్రపంచ దేశాల అధినేతలను ఆహ్వానించి ఇచ్చిన ఈ విందులో పూర్తిగా శాఖాహార వంటకాలను మాత్రమే వడ్డించడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో సుమారు 80 శాతం మంది మాంసాహారులే ఉన్నారంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ విందులో సాంప్రదాయ భారతీయ రుచులను ప్రతిబింబించేలా మిల్లెట్లు, వివిధ ప్రాంతీయ వెజిటేరియన్ వంటకాలను ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రదర్శించింది. ప్రసిద్ధి చెందిన రకరకాల శాఖాహార వంటకాలతో పాటు ప్రత్యేక డిజర్ట్లను ఈ మెనూలో చేర్చారు. అయితే అంతర్జాతీయ అతిథుల కోసం ఏర్పాటు చేసిన ఈ విందులో కేవలం శాఖాహారానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడంపై రాహుల్ గాంధీ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రికార్డు కోసం చెబుతున్నా, 80 శాతం మంది భారతీయులు మాంసాహారులే. భారతీయ నాన్-వెజ్ ఆహారం చాలా రుచికరంగా ఉంటుంది. నా సోదరి ప్రియాంక చేసే చోలే భటూరే లాగానే అంటూ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఒక ఫొటోను షేర్ చేస్తూ సెటైర్లు వేశారు. అంతర్జాతీయ వేదికలు, సదస్సుల సమయంలో భారతదేశపు గొప్పతనాన్ని, విభిన్న సంస్కృతులను ప్రతిబింబించేలా ఆహార మెనూ ఉన్నప్పటికీ, దీనిపై కాంగ్రెస్ పార్టీ అనవసరమైన వివాదం సృష్టిస్తోందని అధికార బీజేపీ మండిపడింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తదితర బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బ్రిక్స్ దేశాల అధినేతలకు వడ్డించిన ఆహారంపై కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం నమ్మశక్యంగా లేదని, రుచికరమైన, పోషక విలువలు కలిగిన భారతీయ శాకాహార వంటకాలను విదేశీ అతిథులు ఎంతో ఆస్వాదించారని అంటున్నారు. దేశం గర్వించదగిన అంతర్జాతీయ సదస్సును విజయవంతం చేయడంపై దృష్టి పెట్టాల్సింది పోయి, కేవలం డైనింగ్ టేబుల్ మెనూపై వివాదం రాజేయడం విపక్షాల సంకుచిత రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.
0 Comments