పెళ్లికెదిగిన ముగ్గురు కుమార్తెలను, భార్య సిమెంట్ దిమ్మెతో కొట్టి చంపిన కిరాతకుడు

రాజస్థాన్ రాజధాని జైపూర్‌ కర్ధనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్ వాటిక ప్రాంతంలో రాహుల్ ఝా అనే వ్యక్తి తన భార్యతో పాటు పెళ్లికెదిగిన ముగ్గురు కుమార్తెలను అత్యంత కిరాతకంగా కొట్టి చంపాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు ఇంట్లో ఉన్న భారీ సిమెంట్ దిమ్మెతో నిద్రిస్తున్న భార్య గీతా ఝా (40), కుమార్తెలు నందిని, రాధిక, గౌరీ (15 నుంచి 22 ఏళ్ల వయస్సు)ల తలలు, ముఖాలపై విచక్షణారహితంగా మోదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో నలుగురూ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో రక్తపు మడుగులో వేర్వేరు గదుల్లో పడి ఉన్న నాలుగు మృతదేహాలను గమనించిన కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు భయాందోళనలకు గురై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ), కర్ధనీ పోలీసులు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. హత్యకు ఉపయోగించిన సిమెంట్ బ్లాకును పోలీసులు స్వాధీనం చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం నిందితుడు రాహుల్ ఝా తన మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Post a Comment

0 Comments