విజయవాడ ఆటోనగర్‌లోని ప్రముఖ హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనం పైభాగంలో ఒక్కసారిగా పొగలు, మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలు వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం రోజున జరగడం వల్ల షోరూమ్‌కు సెలవు ఉండటంతో పెద్ద ముప్పు తప్పిందని స్థానికులు తెలిపారు. ఒకవేళ సాధారణ పనిదినం అయి ఉంటే షోరూమ్ సిబ్బంది, కస్టమర్లతో రద్దీగా ఉండే అవకాశం ఉండేదని, సెలవు కావడంతో ప్రాణనష్టం, ఎవరికీ గాయాలు కాకపోవడం ఊరటనిచ్చే అంశమని అటు అధికారులు సైతం ఊపరిపీల్చుకున్నారు.భవనం పైభాగంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఆస్తి నష్టం అంచనా వేయనున్నారు. అలాగే ప్రమాదానికి గల కారణాలపైనా పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు.

Post a Comment

أحدث أقدم