జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి నాగార్జున సర్కిల్ వరకు భారీ టూ-వే ఎలివేటెడ్ కారిడార్‌ ?

హైదరాబాద్ లోని కేబీఆర్ జాతీయ పార్క్ చుట్టూ గతంలో ప్రతిపాదించిన భారీ నిర్మాణ ప్రణాళికల్లో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. 'హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' (హెచ్-సిటీ) ప్రాజెక్ట్‌లో భాగంగా గతంలో అనుకున్న 14 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల ప్రతిపాదనను పూర్తిగా పక్కనబెట్టి, దానికి బదులుగా కేవలం ఒకే ఒక భారీ టూ-వే ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఇటీవల అమలు చేసిన వన్‌వే నిబంధన అనూహ్య ఫలితాలను ఇచ్చింది. ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలు అత్యంత సులువుగా సాగుతుండటాన్ని గమనించిన యంత్రాంగం, గత డిజైన్‌ను మార్చాలని భావించింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి నాగార్జున సర్కిల్ వరకు ఒకే ఒక ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తే సరిపోతుందని తుది నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీనివల్ల మాదాపూర్, హైటెక్ సిటీ, ఆపై ప్రాంతాలకు వెళ్లే లక్షలాది మంది వాహనదారులకు ట్రాఫిక్ సిగ్నల్స్ వెయింటింగ్ లేని ప్రయాణ సౌకర్యం కలగనుంది. గతంలో జీహెచ్‌ఎంసీ రూపొందించిన ప్రణాళిక ప్రకారం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నంబర్ 2, రోడ్ నంబర్ 45, ఫిల్మ్‌నగర్, రోడ్ నంబర్ 12, 10 కూడళ్ల వద్ద రెండు నుంచి నాలుగు లేన్ల ఫ్లైఓవర్లు, భూగర్భ మార్గాలు నిర్మించాల్సి ఉంది. అయితే ఈ కాంక్రీట్ నిర్మాణాల వల్ల కేబీఆర్ పార్క్ పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని పర్యావరణ వేత్తలు, నగర వాసులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నగరంలో కీలకమైన ఈ పచ్చదనాన్ని కాపాడేందుకు ఫ్లైఓవర్ల కంటే వన్‌వే విధానమే సరిపోతుందని అప్పట్లో సూచించారు. ఇప్పుడు ప్రభుత్వం అదే దిశగా నిర్ణయం తీసుకోవడంతో పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాత ప్రణాళికను ఉపసంహరించుకోవడానికి పర్యావరణంతో పాటు మరో ప్రధాన కారణం 'భూసేకరణ'. తొలి డిజైన్ ప్రకారం దాదాపు 247 స్థలాలను, భవనాలను సేకరించాల్సి ఉంది. అందులో ప్రముఖ రాజకీయ నాయకులు, సీని స్టార్స్, వీవీఐపీ ఆస్తులు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ ఇచ్చి ఈ స్థలాలను తీసుకోవాలని ఎంత ప్రయత్నించినా యజమానులు అంగీకరించలేదు. చివరికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి వస్తే, ఆయా ప్రాంతాల్లో ఉన్న అపారమైన మార్కెట్ విలువల దృష్ట్యా ప్రభుత్వ ఖజానాపై ఊహించని రీతిలో భారీ ఆర్థిక భారం పడుతుందని గుర్తించారు. ఇప్పటికే పలువురు స్థల యజమానులు భూసేకరణపై హైకోర్టును ఆశ్రయించగా, పార్క్ ఈకో సెన్సిటివ్ జోన్ పై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. ఈ వివాదాలన్నింటికీ చెక్ పెడుతూ కొత్త ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్ట్ పొడవు, నిర్మాణ వ్యయం, డిజైన్‌పై కాంట్రాక్ట్ ఏజెన్సీతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ ముగిసిన వెంటనే ప్రభుత్వం నుంచి అధికారికంగా జీవో విడుదల కానుంది.

Post a Comment

0 Comments