మావోయిస్టు నక్కా సుశీల రాణి పోలీసులకు లొంగుబాటు

మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకురాలు, డివిజన్ కమిటీ సభ్యురాలు నక్కా సుశీల రాణి అలియాస్ లత, లలిత, రేలా, జ్యోతి పోలీసులకు లొంగిపోయారు. ఇది మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బగా నిజామాబాద్ సీపీ సాయిచైతన్య అభివర్ణించారు. సుశీల లొంగుబాటు వివరాలను ఆయన ఇవాళ మీడియాకు వెల్లడించారు. వరుస లొంగుబాట్ల నేపథ్యంలో ఆ పార్టీ పునర్నిర్మాణ సామర్థ్యం కూడా బలహీనపడినట్లు సీపీ పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి (పీబీఎం - సీపీఐ మావోయిస్టు మాజీ ప్రధాన కార్యదర్శి), జడె రత్నబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగు (డీకేఎస్‌జెడ్‌సీఎం) అనే ముగ్గురు మాత్రమే తెలంగాణకు వెలుపల మావోయిస్టు పార్టీ వివిధ నిర్మాణాల్లో అజ్ఞాతంగా పనిచేస్తున్నట్లు పోలీసు శాఖ వెల్లడించింది. మావోయిస్టు కార్యకలాపాల్లో కొనసాగుతున్న తెలంగాణకు చెందిన అజ్ఞాత కార్యకర్తలందరూ హింసాత్మక మార్గాలను వీడి జనజీవన స్రవంతిలో చేరాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు, పునరావాస విధానం ద్వారా అందించే ప్రయోజనాలను పొందాలని సూచించారు. ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్‌, జిల్లా పోలీసుల సమిష్టి కృషి, నిఘా వ్యవస్థ బలోపేతం, పునరావాస విధానంపై పెరుగుతున్న విశ్వాసం కారణంగానే ఈ స్థాయిలో లొంగుబాట్లు చోటుచేసుకున్నట్లు పోలీసు శాఖ పేర్కొంది.

Post a Comment

0 Comments