హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌లో కొలువైన పంచముఖ సంకటహర మహా గణపతి శుక్రవారం మధ్యాహ్నం భక్తుల కోలాహలం నడుమ నిమజ్జనం పూర్తయింది. ప్రధాన నిమజ్జన ఘట్టం ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ముగియడం పట్ల భక్తులతోపాటు పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. వరుణుడు కూడా కరుణించాడు. ట్యాంక్‌బండ్‌పై క్రేన్ నంబర్-4 దగ్గర గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నిమజ్జనం పూర్తి చేశారు. మహా గణపతి నిమజ్జనాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 9.30 గంటల సమయంలో ఖైరతాబాద్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. సెన్సేషన్ థియేటర్, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా శోభాయాత్ర కొనసాగింది. మధ్యాహ్నం 2.15 గంటలకు హుస్సేన్‌సాగర్‌లో భారీ క్రేన్ల సాయంతో నిమజ్జన ప్రక్రియను పూర్తి చేశారు. సెక్రటేరియట్ సౌత్ ఈస్ట్ మార్గంలో భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, అప్పర్ ట్యాంక్ బండ్‌పై అత్యంత కోలాహలంగా వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాలు కొనసాగుతున్నాయి. జంట నగరాల నుంచి భారీగా విగ్రహాలు తరలివస్తున్నాయి. 12 క్రేన్ల ద్వారా నిమజ్జనం ప్రక్రియ కొనసాగుతోంది. భద్రత కోసం పోలీస్ కంట్రోల్ రూం ద్వారా 58 సీసీటీవీ కెమెరాలతో పోలీసులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తి అయ్యేలా అప్పర్ ట్యాంక్ బండ్‌పై భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రతి క్రేన్ వద్ద ఒక ఎసఐ, ఐదుగురు పోలీస్ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో రంగంలోకి 25 క్రైమ్ టీమ్స్, 10 షీ టీమ్స్ బృందాలు విధులు నిర్వర్తిస్తున్నాయి.
ఖైరతాబాద్ గణనాధుని నిమజ్జనం పూర్తి : భారీగా తరలివచ్చిన భక్త జనం
Friday, September 25, 2026
Devotees Turn Out in Large Numbers Immersion of Khairatabad Ganesha Concluded Khairatabad in Hyderabad telangana
No comments:
Post a Comment