నాన్- బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ నమోదు సర్టిఫికేట్‌ను స్వచ్ఛందంగా రద్దు చేయడానికి టాటా సన్స్ పెట్టుకున్న దరఖాస్తును రిజర్వ్ బ్యాంక్ తిరస్కరించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కాకుండా ప్రైవేట్ సంస్థగా కొనసాగేందుకు చూసిన మార్గాలన్నీ మూసుకుపోయినట్లేనని, ఇక లిస్టింగ్ కాక తప్పకపోవచ్చని పేర్కొన్నాయి. ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ను స్వచ్ఛందంగా రద్దు చేసుకోవడం కోసం టాటా సన్స్ సమర్పించిన దరఖాస్తును ఆర్‌బీఐ తిరస్కరిస్తే కంపెనీ అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీ రూల్స్‌కి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఇందుకు సంబంధించి లేఖను కంపెనీ సెక్రెటరీ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పొందినట్లు కొన్ని మీడియాలు తెలిపాయి. దీంతో టాటా సన్స్ కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ అయ్యే అవకాశాలు పెరిగాయి. తత్పలితంగా భారత కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓగా టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూ ఖాయమైందనే చర్చ మొదలైంది. జులై 1, 2026 నుంచి వచ్చిన ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం రూ.1 లక్ష కోట్ల ఆస్తులు కలిగిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలను అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా పరిగణిస్తారు. 2026 మార్చి నాటికి టాటా సన్స్ ఆస్తుల విలువ రూ.2 లక్షల కోట్లకు పైగా ఉండడంతో దీన్ని అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్‌బీఐ గుర్తించింది. ఇలా గుర్తింపు పొందిన సంస్థ మూడేళ్లలోగా స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కావాల్సి ఉంటుంది. టాటా గ్రూప్ సంస్థలకు ఎన్‌బీఎఫ్‌సీ కేటగిరీలో టాటా సన్స్ ప్రధాన పెట్టుబడి సంస్థగా కొనసాగుతోంది. అయితే, ఈ లిస్టింగ్ నుంచి తప్పించుకునేందుకు పెట్టుబడి కంపెనీగా డీ-రిజిస్టర్ చేయాలంటూ టాటా సన్స్ 2024లో రిజర్వ్ బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంది. తాజాగా ఈ దరఖాస్తును కేంద్ర బ్యాంక్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై రిజర్వ్ బ్యాంక్ కానీ, టాటా సన్స్ కానీ ఈ కథనం రాసే సమయానికి అధికారింగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. 18.37 శాతం వాటా కలిగిన షాపూర్జీ పల్లోంజీ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌కు పట్టుబడుతోంది. లిస్టింగ్ ద్వారా వచ్చే నిధులతో అప్పులు తీర్చుకోవచ్చని పల్లోంజీ గ్రూప్ భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఓ ద్వారా టాటా సన్స్ మార్కెట్లోకి వస్తే గ్రూప్ కార్పొరేట్ గవర్నెన్స్, పెట్టుబడుల కేటాయింపులపై మరింత పారదర్శకత పెరుగుతుందని ఎస్‌పీ గ్రూప్ వంటి వాటాదారులు చెబుతున్నారు. అయితే, టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా దీనిని వ్యతిరేకిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
0 Comments