తెలంగాణాలో డ్రైవర్లు, గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ వర్కర్ల ప్రయోజనాలను పరిరక్షిస్తూ ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందేలా రవాణా వ్యవస్థను పటిష్టం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆటో, క్యాబ్ మరియు యాప్ ఆధారిత రవాణా రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సంబంధిత అధికారులతో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో 'తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్' ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలసి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. యూనియన్ ప్రతినిధులు సమర్పించిన అంశాలను మంత్రి సానుకూలంగా విన్నారు. ఇటీవల ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం, 2012 తర్వాత ఆటో ఛార్జీల పెంపుపై ప్రభుత్వం చర్యలు చేపట్టడంపై యూనియన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్‌ను త్వరితగతిన అమలు చేయాలని, యాప్ ఆధారిత రవాణా రంగంలో పనిచేస్తున్న ఆటో, క్యాబ్, సరుకుల రవాణా వాహనాల డ్రైవర్లకు న్యాయం జరిగేలా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని మంత్రిని యూనియన్ ప్రతినిధులు కోరారు. ఓలా, ఉబెర్, రాపిడో, పోర్టర్ వంటి యాప్ ఆధారిత రవాణా అగ్రిగేటర్లపై నియంత్రణకు సంబంధించి మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2025 ప్రకారం ప్రభుత్వం నిర్దేశించే కనీస బేస్ ఛార్జీ, కిలోమీటర్ ఛార్జీ, నిమిషం ఛార్జీలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాప్ ఆధారిత ప్రయాణీకుల, సరుకుల రవాణాకు ఉపయోగించే ప్రైవేట్ వాహనాల విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మంత్రిని కోరారు. అవసరమైన చోట మోటార్ వెహికల్స్ చట్టం-1988 ప్రకారం వాణిజ్య రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయాలని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు, డ్రైవర్ల జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని హైర్ వెహికల్ ఛార్జీలను కూడా పెంచాలని కోరారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలసిన తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు : సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق