గుజరాత్‌లోని సూరత్‌లో చాలాకాలంగా తాళం వేసి ఉన్న ఎన్‌ఆర్‌ఐ ఇంట్లో చోరీకి వెళ్లిన ఓ దొంగకు ఊహించని పరిస్థితి ఎదురైంది. రాత్రి సమయంలో ఇంటికి ఉన్న ఇనుప గ్రిల్స్‌ దూరి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా, అందులో అతడు ఇరుక్కుపోయాడు. ఎంత ప్రయత్నించినా బయటపడలేక రాత్రంతా అక్కడే నానా తంటాలు పడ్డాడు. సూరత్‌లోని రాజారాం నగర్‌ సొసైటీకి చెందిన కిశోర్‌భాయ్‌ అమెరికాలో నివసిస్తున్నారు. ఆయనకు చెందిన భవనం చాలాకాలంగా ఖాళీగానే ఉంటోంది. ఖాళీగా ఉన్న ఆ ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన దుండగుడు, కిటికీ ఇనుప గ్రిల్స్‌ మధ్యలో ఇరుక్కుపోయి బయటకు రాలేకపోయాడు. తెల్లారాక గ్రిల్స్‌లో వేలాడుతున్న దొంగను గమనించిన స్థానికులు ఆగ్రహంతో కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కపోద్రా పోలీసులు రంగంలోకి దిగారు. అమెరికాలో ఉన్న ఇంటి యజమాని కిశోర్‌భాయ్‌తో మాట్లాడగా, ఆ ఇంట్లో అసలు నగదు లేదా విలువైన వస్తువులు ఏమీ లేవని స్పష్టం చేసినట్లు ఇన్‌స్పెక్టరు ఎం.ఆర్‌.సోలంకి తెలిపారు.

Post a Comment

أحدث أقدم