ఆంధ్రప్రదేశ్ లో  రైతు బజార్ల ద్వారా రాయితీపై ఉల్లిపాయలను విక్రయించడానికి పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలోని రైతు బజార్లలో రూ. 32 కే కిలో ఉల్లిపాయలను అందించేందుకు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. అక్రమాలను, అక్రమ నిల్వలను అడ్డుకునేందుకు ఒక పక్కా ప్రణాళికను రూపొందించారు. రేషన్ బియ్యం పంపిణీ కోసం వాడుతున్న 'రైస్' యాప్‌లోనే ప్రతి కుటుంబం తీసుకునే ఉల్లి వివరాలను నమోదు చేయనున్నారు. ప్రతీ కుటుంబానికి వారానికి రెండు కిలోల చొప్పున ఈ రాయితీ ఉల్లిని అందించనున్నారు. రాబోయే రెండు రోజుల్లో ఈ పంపిణీ ప్రక్రియ అందుబాటులోకి రానుంది. వారం రోజుల కిందట రూ. 50గా ఉన్న ఉల్లి ధర, ఒక్కసారిగా రూ. 80 మార్కును దాటేసింది. రెండు నెలల కిందట కేవలం రూ. 20 పలికిన కిలో ఉల్లి ధర ఇప్పుడు మూడింతలు కావడం గమనార్హం. వర్షాభావ పరిస్థితుల వల్ల మహారాష్ట్ర, కర్ణాటక, కర్నూలు ప్రాంతాల్లో దిగుబడి గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం కేవలం మహారాష్ట్ర నుంచి మాత్రమే అరకొరగా సరుకు వస్తుండటంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధరలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో కిలో ఉల్లి రూ. 100కు చేరినా ఆశ్చర్యం లేదని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఉల్లి మంట నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. కేంద్రం బఫర్ స్టాక్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు భారీగా ఉల్లిపాయలను కేటాయించేందుకు అంగీకరించింది. కేంద్రం నుంచి వస్తున్న ఈ నిల్వలనే రైతు బజార్ల ద్వారా రూ. 32 చొప్పున ప్రజలకు అందించనున్నారు. బహిరంగ మార్కెట్లో రూ. 80 వరకు ఉన్న ఉల్లిని సగానికంటే తక్కువ ధరకు అందించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఉపశమనం లభించనుంది.


Post a Comment

أحدث أقدم