దేశంలో ప్రపంచ ప్రసిద్ధ ఫార్ములావన్‌ కారు రేసింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ రేసు పునరుద్ధరణకు ఉన్న అవకాశాలు, ఎదురయ్యే సవాళ్లు, సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు పది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర క్రీడా మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం వెల్లడించారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు నీతి ఆయోగ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ యుగల్‌ కిషోర్‌ జోషి అధ్యక్షత వహించనున్నారు. ఇందులో క్రీడా శాఖ సంయుక్త కార్యదర్శి కునాల్‌తో పాటు భారత మోటార్‌ స్పోర్ట్స్‌ సంఘం అధ్యక్షుడు అరిందమ్‌ ఘోష్‌ కూడా ఉన్నారు. అలాగే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌, పరోక్ష పన్నుల బోర్డు అధికారులకు కూడా ఈ టాస్క్‌ఫోర్స్‌లో చోటు దక్కింది. 'దేశంలో మోటార్‌ స్పోర్ట్స్‌ పునరుద్ధరణలో ఎదురయ్యే సవాళ్లను ఇది క్షుణ్ణంగా అంచనా వేస్తుంది. దానికి అనుగుణంగా విధానపరమైన చర్యలు గుర్తిస్తుంది. పన్ను సంబంధిత సమస్యలతో పాటు పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ నమూనాల అవకాశాలను కూడి పరిశీలిస్తాము. 2028 నాటికి దేశంలో ఫార్ములావన్‌ రేసును మళ్లీ నిర్వహించడమే మా లక్ష్యం'అని మాండవీయ తెలిపారు. గ్రేటర్‌ నోయిడాలోని బుధ్ధ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌ వేదికగా మనదేశంలో చివరిసారిగా 2013లో ఫార్ములావన్‌ రేసు జరిగింది. ఆ తర్వాత పరిపాలన, పన్ను సంబంధిత సమస్యలతో రేసు నిలిచిపోయింది. గతేడాది ఎఫ్‌1 విడుదల చేసిన ప్రకటన ప్రకారం భారత దేశంలో దాదాపు 10 కోట్ల మంది మోటార్‌ స్పోర్ట్స్‌ క్రీడాభిమానులు ఉన్నప్పటికీ ఎఫ్‌1 నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకుంది. మౌలిక సదుపాయాలు, భద్రతా వంటి పలు కోణాలను పరిశీలించిన తర్వాతే వేదిక ఖరారు చేయనున్నారు.

Post a Comment

أحدث أقدم