టీటీడీకి రిలయన్స్ సంస్థ 15 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించింది. ఈ బస్సులు ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసారు. ఈ బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు చేరుకున్నాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గతంలో టీటీడీకి 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సులను విరాళంగా ప్రకటించారు. వీటిల్లో 15 బస్సులు ఇప్పటికే అందించగా, మిగతా 10 బస్సులు త్వరలోనే తిరుమలకు చేరుకోనున్నాయి. ప్రస్తుతం వచ్చిన బస్సులను త్వరలో ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ప్రారంభించనున్నారు. ఇప్పటికే తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో ధర్మరధం పేరుతో ఉచిత బస్సులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ బస్సులు సైతం అందుబాటులోకి రానున్నాయి. అనంత్ అంబానీ జూన్ లో శ్రీవారిని దర్శించుకున్న సమయంలో రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్లు ప్రకటించారు. అదే విధంగా వాటి నిర్వహణకు అవసరమైన 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా రిలయన్స్ సంస్థ అందించేలా నిర్ణయం ప్రకటించారు. ఇప్పుడు ఈ బస్సులు అందుబాటులోకి తీసుకు రావటం ద్వారా సామాన్య భక్తులకు ఇక సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. ఎక్కడకు వెళ్లాలన్నా వారికి వెసులు బాటు కలగనుంది. ప్రయివేటు వాహనాలు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్న వేళ.. ఈ బస్సులు ప్రయోజనకరంగా ఉంటాయని వివరిస్తున్నారు. ఈ బస్సుల్లో ఉచితంగా తిరుమల శ్రీవారి భక్తులు ప్రయాణం చేయవచ్చు.
టీటీడీకి 15 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందజేసిన రిలయన్స్ సంస్థ
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق