హారాష్ట్రలోని హింగోలి జిల్లా సంతుక్ పింప్రి గ్రామం నుంచి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'స్కూల్ ఠీక్ కరో' క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రాథమిక సౌకర్యాల లోపాలను ఎత్తిచూపుతూ,.. తల్లిదండ్రులు, సర్పంచ్‌లను సామాజిక తనిఖీలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్యాంపెయిన్‌కు షారుఖ్ ఖాన్ నటించిన 'స్వదేశ్' సినిమా గొప్ప ప్రేరణగా నిలిచిందని దీప్కే స్వయంగా తెలిపారు.  దీప్కే తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) పోస్టులో 'స్వదేశ్' సినిమాను వందసార్లకు పైగా చూశాననీ, అందులోని ఒక సన్నివేశం తనను ఎప్పటికీ కదిలించిందని వివరించారు. సినిమాలోని హీరో మోహన్.. పేద కుటుంబ కష్టాలను చూసి, రైల్వేస్టేషన్‌లో నీరు అమ్ముతున్న పిల్లవాడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న సన్నివేశం తన హృదయాన్ని తాకిందనీ, అలాగే తాను కూడా ప్రతిసారీ కన్నీళ్లు పెట్టుకున్నానని అన్నారు. "నా గ్రామం కోసం కూడా మోహన్ లాగా ఏదైనా చేయాలని ఎప్పుడో కోరుకున్నాను. జీవితం అలా తిరిగి వచ్చింది. అమెరికా నుంచి తిరిగి వచ్చి నా గ్రామానికి సేవ చేసే అవకాశం దక్కింది" అని దీప్కే రాశారు. స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు గడిచినా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో.. తాగునీరు, బెంచీలు, శుభ్రమైన టాయిలెట్లు, సరిపడా కిటికీలు, విద్యుత్ లాంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం ఆందోళనకరమని దీప్కే ఆరోపించారు. "నా స్వగ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించినప్పుడు.. టాయిలెట్లకు నీరు లేకపోవడం, విరిగిన కిటికీలు, తగినంత సీటింగ్ లేకపోవడం వంటి సమస్యలు కనిపించాయి" అని ఆయన చెప్పారు. ఈ సమస్యల్ని స్థానిక సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగా.. ఒక వారంలోపు సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు సామాజిక తనిఖీలు చేసి, లోపాలను వీడియోలు తీసి.. సీజేపీకి పంపాలనీ, సర్పంచ్‌లు సరి చేస్తే వాటిని సోషల్ మీడియాలో గుర్తిస్తామని పిలుపునిచ్చారు.

Post a Comment

أحدث أقدم