ప్రముఖ బెంగాలీ దర్శకుడు రాజా సేన్‌ (71) కోల్‌కతాలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని బెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. వెన్ను భాగంలో గాయపడటంతో తొలిత ఆయనను ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో ఆయన్ని మరో ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి దిగజారడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1996లో విడుదలైన 'దాము' చిత్రంతో రాజా సేన్‌ దర్శకుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఓ బాలుడు, ఏనుగు మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఆ తర్వాత 'ఆత్మీయ స్వజన్‌', 'దేశ్‌', 'దేబీపక్ష', 'కృష్ణకాంతేర్‌ విల్‌', 'లాబొరేటరీ', 'మాయా మృదంగ', వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 2002లో విడుదలైన 'దేశ్‌' చిత్రంలో జయా బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాలతో పాటు డ్యాక్యుమెంటరీల రూపకల్పనలోనూ రాజాసేన్‌ తనదైన ముద్ర వేశారు. ప్రముఖ రవీంద్ర సంగీత గాయని సుచిత్రా మిత్రతో పాటు పలువురు ప్రముఖుల జీవితాలపై ఆయన డాక్యుమెంటరీలు రూపొందించారు.

Post a Comment

أحدث أقدم