కెనడాలోని టొరంటోలో స్ట్రీట్ ఫెస్టివల్ జరుగుతుండగా కాల్పుల కలకలం చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల శబ్దాలతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత అక్కడ యాక్టివ్ షూటర్ ఉన్నట్లు హెచ్చరించిన పోలీసులు, ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని ప్రకటించారు. సెయింట్ క్లేర్ ఎవెన్యూ వెస్ట్, అర్లింగ్టన్ ఎవెన్యూ సమీపంలో 'సాల్సా ఆన్ సెయింట్ క్లేర్' ఉత్సవం జరుగుతుండగా ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని, మొత్తం ఆరుగురికి బుల్లెట్ గాయాలయ్యాయని టొరంటో పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రజలెవరూ ఆ ప్రాంతానికి రావద్దని హెచ్చరించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సురక్షితంగానే ఉన్నప్పటికీ, కాల్పులకు తెగబడిన నిందితుడు లేదా నిందితులు ఇంకా పట్టుబడలేదని పోలీసులు తెలిపారు. లాటినో సంస్కృతి నేపథ్యంలో జరుగుతున్న ఈ 'సాల్సా' ఉత్సవ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఉత్సవంలో స్టాల్ నడుపుతున్న ప్యాట్సీ గుటిరెజ్ అనే మహిళ మాట్లాడుతూ తాను కస్టమర్లకు వస్తువులు ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా జనం భయంతో పరుగులు తీయడం చూశానని తెలిపారు. దీంతో తాము వ్యాపారాన్ని నిలిపివేశామని, ఇలాంటి ఉత్సవాల్లో హింసాత్మక ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రత్యక్ష సాక్షి వాలెరీ రోడ్రిగ్జ్ మాట్లాడుతూ శనివారం రాత్రి తాను ఒక రెస్టారెంట్ సమీపంలో కూర్చుని ఉన్నప్పుడు జనం కేకలు వేస్తూ పరుగులు తీశారని చెప్పారు. ఏం జరుగుతుందో తెలియక, ప్రాణభయంతో అందరం నేలపై పడుకున్నామని ఆమె వివరించారు. ఈ హింసాత్మక ఘటనపై అంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. 'సాల్సా ఆన్ సెయింట్ క్లేర్ ఫెస్టివల్‌లో జరిగిన ఈ దారుణ హింస నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయపడటం బాధాకరం. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను' అని పేర్కొన్నారు. అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం లాటినో సంస్కృతి ప్రతిబింబించేలా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో లైవ్ లాటిన్ సంగీతం, నృత్య ప్రదర్శనలు, సంప్రదాయ ఆహార స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఏడాది ఈ ఉత్సవం 22వ సారి జరుగుతోంది. టొరంటో నగర నడిబొడ్డున ఉన్న వాణిజ్య ప్రాంతంలో జరిగే ఈ వేడుకకు వేలాది మంది ప్రజలు తరలివస్తుంటారు. అలాంటి రద్దీ ప్రాంతంలో ఈ ఘోరం జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
టొరంటోలో 'సాల్సా ఆన్ సెయింట్ క్లేర్' ఉత్సవంలో కాల్పులు : ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق