మహారాష్ట్రలోని పూణెలో సంచలనం సృష్టించిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26) హత్యోదంతం మరువక ముందే ఆ కుటుంబంలో మరో తీవ్ర విషాదం నెలకొంది. మనవడి ఘోర మరణాన్ని తట్టుకోలేక, మానసిక వేదనతో కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ ఆదివారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో పూణెలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన, పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని తెలియజేస్తూ కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా 'మిస్ యూ డాడ్' అంటూ పెట్టిన పోస్ట్ అందరినీ కన్నీటిపర్యంతం చేస్తోంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం దేవీచంద్ అగర్వాల్‌కు కొంతకాలం క్రితమే ఒక పెద్ద హార్ట్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన వయోభారంతో కూడిన పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ తరుణంలో, కొన్ని వారాల క్రితం తన మనవడు కేతన్ అగర్వాల్ అత్యంత పాశవికంగా హత్యకు గురైన వార్త ఆయనను మానసికంగా కోలుకోలేని దెబ్బతీసింది. మనవడి మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్రమైన మానసిక క్షోభకు గురికావడంతో ఆయన ఆరోగ్యం మరింత వేగంగా క్షీణించింది. కొద్ది రోజుల క్రితం పరిస్థితి బాగా విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ అమర్చి కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.