అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఒక కారు ప్రమాదంలో పల్నాడు జిల్లాకు చెందిన మక్కెన ప్రసన్న (27) అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన రైతు దంపతులు మక్కెన వెంకటేశ్వర్లు, గోవిందమ్మల పెద్ద కుమార్తె ప్రసన్న. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆమె 2022లో అమెరికా వెళ్లారు. ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసిన ప్రసన్న, అక్కడ ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో ఒక కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం సంభవించింది. వారు ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న ఒక చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్న సంఘటనా స్థలంలోనే మరణించగా, కారులో ఉన్న ఆమె స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దురదృష్టకర సంఘటనపై స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బాధిత కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించారు. ప్రసన్న భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా సొంత గ్రామానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తమ కుమార్తె మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించాలని తల్లిదండ్రులు కన్నీళ్లతో ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
إرسال تعليق