ఆంధ్రప్రదేశ్ లో ఫీజుల నియంత్రణ కమిటీ చైర్‌పర్సన్ నియామకం వాయిదా పడుతూ వస్తుండటంతో, కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల ఖరారు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ తో పాటు ఇతర డిగ్రీ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఉండేందుకు.. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులకే తాత్కాలికంగా 10 శాతం పెంపు వర్తింపజేసి కౌన్సెలింగ్ ప్రారంభించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్రంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఉన్నత విద్యా కోర్సుల ఫీజులను అధికారికంగా సవరించే విధానం అమల్లో ఉంది. గడువు ముగియడంతో ఈ ఏడాది కొత్త ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఫీజుల నియంత్రణ కమిటీ చైర్‌పర్సన్ నియామకం ఆలస్యం కావడంతో కాలేజీల వారీగా ఫీజుల లెక్కింపు ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనివల్ల ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా ఆలస్యమవుతుండటంతో ఉన్నత విద్యాశాఖ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఫీజుల నియంత్రణ కమిటీ ద్వారా కొత్త ఫీజుల పూర్తి స్థాయి ఖరారుకు మరికొంత సమయం పట్టేలా ఉంది. దీనివల్ల విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ మరింత ఆలస్యమైతే విద్యా సంవత్సరం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే, విద్యార్థులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు గత మూడేళ్లుగా అమల్లో ఉన్న పాత ఫీజులకే అదనంగా 10 శాతం పెంపును జోడించి, దానిని తాత్కాలిక ఫీజుగా నిర్ణయించే అవకాశాలను పరిశీలిస్తున్నామని ఉన్నత విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ తాత్కాలిక ఫీజుల పెంపు ప్రతిపాదనకు సంబంధించిన ఫైల్‌ను ఉన్నత విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనకు పంపినట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆమోదం లభించిన వెంటనే ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ లో బీటెక్, డిగ్రీ ఫీజులు 10 శాతం పెరిగే అవకాశం ?
Friday, July 3, 2026
Andhra Pradesh education Likely 10% Hike in B.Tech and Degree Course Fees process of finalizing fees for the new academic year
No comments:
Post a Comment