అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, ముడిచమురు ధరల మంట దేశీయ మార్కెట్లను కుప్పకూల్చాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలతో సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 243 పాయింట్లు నష్టపోయి 23,123 వద్ద స్థిరపడింది. మరోవైపు, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 719 పాయింట్లు దిగజారి 73,524 వద్ద ముగిసింది. మార్కెట్ అస్థిరతను సూచించే ఇండియా విక్స్ ఏకంగా 7.25% పెరిగి 16.93 మార్కుకు చేరడం మదుపరుల్లో ఉన్న తీవ్ర ఆందోళనను ప్రతిబింబిస్తోంది. భారత ఈక్విటీ మార్కెట్ ఇంతలా కుప్పకూలడానికి ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయం, ద్రవ్యోల్బణ భయాలు కారణమయ్యాయి. యుద్ధ భయాల నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడులవైపు మదుపరులు మొగ్గు చూపడం మార్కెట్ల పతనానికి దారితీసింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా రవాణాకు ఆటంకం కలుగుతుందనే భయాలు పెరిగాయి. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 4.5% పైగా పెరిగి బ్యారెల్‌కు 97.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడే భారతదేశం లాంటి ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద దెబ్బ. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ క్షీణిస్తుందనే ఆందోళన ఇన్వెస్టర్లను వెంటాడింది.
గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలతో నష్టాలతో ముగిసిన సూచీలు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق