ఉత్తరప్రదేశ్ లోని మౌదర్వాజా పరిధిలోని బీబీగంజ్ బహదూర్‌గంజ్ మొహల్లాకు చెందిన వివేక్ శాక్య 18 ఏళ్ల కుమార్తె సలోని తన ఇంటి టెర్రస్ పై కూర్చుని ఉంది. అదే సమయంలో టౌన్ హాల్ మొహల్లాకు చెందిన ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. బలవంతంగా ఇంట్లోకి చొరబడి, నేరుగా మిద్దె పైకి వెళ్ళి సలోనిపై నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. బుల్లెట్ సలోని కుడి కాలినరంలోకి దూసుకుపోయింది. ఆమె గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు పైకి పరుగులు తీశారు. అందరూ రావడం చూసిన సదరు యువకుడు అక్కడి నుండి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు ఈ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్టేషన్ ఇన్‌ఛార్జ్ అజబ్ సింగ్ వెంటనే సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన సలోనిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదంతంపై సదర్ ఏరియా ఆఫీసర్ అభయ్ వర్మ మాట్లాడుతూ కాల్పులు జరిపిన యువకుడిని విశాల్‌గా గుర్తించినట్లు తెలిపారు. విశాల్, సలోని ఇద్దరూ స్నేహితులని, వారి మధ్య గతంలో పరిచయం ఉందని పేర్కొన్నారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించామని, అతడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఓ స్పష్టం చేశారు. ప్రస్తుతం నిందితుడి తండ్రి విశంభర్ కశ్యప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
0 Comments