బ్రిటన్ రాజధాని లండన్ నడిబొడ్డున ఉన్న అత్యంత సున్నితమైన ప్రభుత్వ భవనం 'మార్షమ్ స్ట్రీట్'లో ఒక రహస్య కెమెరా లభ్యమవ్వడం అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తోంది. ఈ భవనంలోనే బ్రిటన్ దేశ హోమ్ శాఖతో పాటు గృహనిర్మాణ, స్థానిక ప్రభుత్వాల మంత్రిత్వ శాఖ కార్యాలయాలు ఉన్నాయి. 'ది ఐ పేపర్' మొదటిసారిగా బయటపెట్టిన ఈ గూఢచర్య ఉదంతం, బ్రిటన్ ప్రభుత్వ కార్యాలయాల భద్రతా లోపాలను మరోసారి తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా తిరిగే ఒక కమ్యూనల్ ఏరియాలోని సీలింగ్ ప్యానెల్‌లో ఈ రహస్య నిఘా పరికరం దాచబడినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే బ్రిటన్ ప్రభుత్వ మంత్రులను, ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. దీని వెనుక చైనా , రష్యా దేశాల హస్తం ఉందనడానికి ప్రస్తుతానికి ఎలాంటి ప్రత్యక్ష ఆధారాలు లభించలేదని దర్యాప్తు వర్గాలు తెలిపినప్పటికీ, బ్రిటన్ నిఘా సంస్థ రంగంలోకి దిగి లోతుగా విచారణ జరుపుతోంది. ఈ రహస్య కెమెరా దొరికిన సమయం అధికారులలో మరిన్ని ఆందోళనలను రేకెత్తిస్తోంది. లండన్‌లో చైనా నిర్మించాలనుకుంటున్న సరికొత్త 'మెగా ఎంబసీ' ప్లానింగ్ అప్లికేషన్‌ను పరిశీలించే ప్రక్రియలో ఈ మార్షమ్ స్ట్రీట్ భవనంలోని అధికారులే కీలక పాత్ర పోషించారు. చైనా ప్రతిపాదించిన ఆ రాయబార కార్యాలయ స్థలం సమీపం నుంచే లండన్ నగరానికి సంబంధించిన అత్యంత సున్నితమైన డేటాను మోసుకెళ్లే ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్ వెళ్తున్నాయి. దీనివల్ల తమ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని బ్రిటన్ ఇంటెలిజెన్స్ సంస్థలు గతంలో అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే, జనవరి 2026లో విడుదలైన తుది నిర్ణయ లేఖలో అక్కడ చైనా ఎంబసీ ఏర్పాటు చేయడం వల్ల ఆ కేబుల్స్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని, హోమ్ ఆఫీస్ లేదా విదేశాంగ శాఖలు దీనిపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు. ఈ వివాదం నడుస్తున్న తరుణంలోనే అదే భవనంలో రహస్య కెమెరా దొరకడం గమనార్హం. ఈ కెమెరా నేరుగా మంత్రుల గదుల వద్ద దొరకనప్పటికీ, అది ఉన్న ప్రాంతం భవనంలోని సిబ్బందిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. తమ కదలికలను, తాము మాట్లాడుకునే రహస్య విషయాలను ఎవరో నిరంతరం గమనిస్తున్నారనే అనుమానంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై బ్రిటన్ ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ షాడో మినిస్టర్ అలెక్స్ బర్ఘార్ట్ తీవ్రంగా స్పందించారు. ఇది అత్యంత తీవ్రమైన భద్రతా ఉల్లంఘన అని, దీనిపై తక్షణమే అత్యవసర దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ రక్షణకు సంబంధించిన కీలక శాఖలు ఉండే భవనంలోనే ఇలాంటి పరికరం దొరకడం ప్రభుత్వ విభాగాల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందని ఆయన అన్నారు.

Post a Comment

أحدث أقدم