భారతీయులకు అత్యంత ఇష్టమైన పెట్టుబడి గమ్యస్థానమైన దుబాయ్‌ రియల్ ఎస్టేట్ రంగంపై పశ్చిమాసియాలో ముదురుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్‌-అమెరికా యుద్ధం నేపథ్యంలో భారతీయ పెట్టుబడిదారులు కొంతకాలం వేచి చూసే ధోరణిని అవలంబించవచ్చని, దీనివల్ల దుబాయ్‌ రియల్టీలోకి వచ్చే భారతీయ మూలధనం తగ్గే అవకాశం ఉందని అనారాక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయుష్ పురి విశ్లేషించారు. అయితే, ఇది కేవలం తాత్కాలిక విరామం మాత్రమేనని, భారత్-దుబాయ్ మధ్య ఉన్న సుదీర్ఘ పెట్టుబడి బంధం చెక్కుచెదరదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి భారత్‌పై రెండు రకాలుగా ప్రభావం చూపుతుందని ఆయుష్ పేర్కొన్నారు. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం హార్మూజ్‌ జలసంధిపై గణనీయంగా ఆధారపడుతుంది. అక్కడ అంతరాయం కలిగితే చమురు ధరలు పెరిగి దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో ఒత్తిడి పెరిగినప్పుడల్లా రూపాయి విలువ ఒడిదుడుకులకు లోనవుతుంది. దీనివల్ల విదేశీ కేటాయింపులు చేసే పెట్టుబడిదారులు తమ నిర్ణయాలను పునసమీక్షించుకోవాల్సి వస్తోంది. సంఘర్షణ స్వల్పకాలికమైతే అది కేవలం భయాందోళనలకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ అది సుదీర్ఘకాలం కొనసాగితే వినియోగదారుల ప్రవర్తన మారుతుంది. పెరిగిన లాజిస్టిక్స్ ఖర్చులు, రూపాయిపై ఒత్తిడి వల్ల పెట్టుబడిదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారని ఆయూష్‌ వివరించారు. దుబాయ్‌లో పెట్టుబడులు తగ్గడం భారతీయ ప్రీమియం హౌసింగ్ మార్కెట్‌కు వరంగా మారే అవకాశం ఉంది. విదేశాల్లో అనిశ్చితి నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన స్వదేశీ మార్కెట్ వైపు మొగ్గు చూపుతారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో గురుగ్రామ్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది.

Post a Comment

أحدث أقدم