బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కఠినమైన పొదుపు చర్యలను ప్రకటించింది. ఆఫీసు వేళల నుంచి మొదలుకొని మార్కెట్ల మూసివేత వరకు ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు విద్యుత్ వినియోగాన్ని భారీగా తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల పనివేళలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పరిమితం చేస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం కలకలం రేపుతోంది. బ్యాంకులు కస్టమర్ సేవలను మధ్యాహ్నం 3 గంటలకే నిలిపివేయాలని, అంతర్గత పనులను 4 గంటల లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కేవలం కార్యాలయాలే కాకుండా, షాపింగ్ మాల్స్, మార్కెట్లను సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం గట్టిగా ఆదేశించింది. అయితే అత్యవసర సేవలు, మెడికల్ షాప్స్, ఫుడ్ సెంటర్లకు మాత్రం మినహాయింపునిచ్చారు. కేవలం పనివేళలను తగ్గించడమే కాకుండా, ప్రభుత్వం తన ఖర్చులపై కూడా భారీగా కోత విధించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంధనం, విద్యుత్ కోసం కేటాయించిన బడ్జెట్‌లో 30 శాతం తగ్గించాలని నిర్ణయించారు. కొత్తగా వాహనాలు, విమానాలు లేదా నౌకలను కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. పార్టీ సెలబ్లేషన్లలో ఏర్పాటు చేసే లైట్లను వాడటంపై కూడా నిషేధం విధించింది బంగ్లాదేశ్. దాదాపు 17 కోట్ల జనాభా కలిగిన బంగ్లాదేశ్.. తన ఇంధన అవసరాల కోసం 95 శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉండటం వల్ల ఈ నిర్ణయాలు తప్పనిసరిగా మారాయని తెలుస్తోంది. ఈ కష్టకాలంలో బంగ్లాదేశ్ భారత్ వైపు ఆశగా చూస్తోంది. ఇంధన దిగుమతుల కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి 2.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కోరుతూనే.. మరోవైపు తక్షణ అవసరాల కోసం డీజిల్ సరఫరా చేయాలని భారతదేశాన్ని అభ్యర్థించింది. ఇప్పటికే భారత్ తన స్నేహహస్తాన్ని అందిస్తూ 5వేల టన్నుల డీజిల్‌ను అదనంగా పంపింది.
إرسال تعليق