హోర్ముజ్ జలసంధిలో తలెత్తిన ఉద్రికత్తలు ప్రపంచ వాణిజ్యానికి ఉరి తాడుగా మారే ప్రమాదం వుందని యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ హెచ్చరిక జారీ చేసింది. ఈ జలసంధి అనేది కేవలం ఒక నీటి మార్గం కాదు, అది ప్రపంచానికి శక్తినిచ్చే 'ధమని'. ప్రపంచ చమురు వాణిజ్యంలో నాలుగో వంతు, గణనీయమైన మొత్తంలో ఎల్‌ఎన్‌జీ, ఎరువులు ఈ సన్నని జలసంధి ద్వారానే రవాణా అవుతాయి. యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ నివేదిక ప్రకారం, ఈ మార్గంలో అంతరాయం కలగడం అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, రవాణా, ఆహార ధరలు.. ఆకాశాన్ని తాకడమే. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి, గ్యాస్ ధరలు పెరిగితే ఎరువుల ధరలు పెరుగుతాయి. రోజుకు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ మార్గం గుండానే వెళ్లాలి. అందులో 84 శాతం ఆసియా దేశాల అవసరాలకే ఉద్దేశించబడింది. ఈ జలసంధి మూతపడితే ఆసియా ఖండంలోని ఇంధన భద్రత కుప్పకూలే ప్రమాదం ఉంది. ఒక వారం ముందు వరకు ఈ మార్గం గుండా వెళ్లిన భారీ నౌకలు, దాడులు ప్రారంభమైన నాటి నుంచి కనిపించకుండా పోయాయి. బీమా ప్రీమియంలు పెరగడం, ఓడల రాకపోకలకు ముప్పు ఉండటంతో సరఫరా గొలుసు పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. అప్పుల భారంతో కునారిల్లుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ 'ప్రైస్ షాక్' కోలుకోలేని దెబ్బ కానుంది. ఇప్పటికే ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడుతున్న ప్రభుత్వాలపై, గృహ బడ్జెట్‌లపై ఈ ధరల పెరుగుదల అదనపు ఒత్తిడిని పెంచుతుందని యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ హెచ్చరించింది. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ, నావిగేషన్ స్వేచ్ఛను పునరుద్ధరించకపోతే, ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచాన్ని మరో భారీ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఉద్రిక్తతలు తగ్గించి, సురక్షిత వాణిజ్య మార్గాలను కాపాడటమే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం.

Post a Comment

أحدث أقدم