తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆదివారం 83,112 మంది శ్రీవారిని దర్శించుకోగా 30,054 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.49కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. చంద్రగ్రహణం కారణంగా బుధవారం దాదాపు 10.30 గంటల పాటు ఆలయం మూసివేయనున్నారు. రేపు మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణ ఉండనుండటంతో రేపు ఉదయం 9 గంటలకు అర్చకులు శ్రీవారి ఆలయ తలుపులను మూసివేయనున్నారు. ఈ క్రమంలో అన్నవితరణ కేంద్రాల్లో ప్రసాదాల తయారీ నిలిపివేయనున్నారు. గ్రహణ సమయం ముగిసిన తర్వాత ఆలయ శుద్ధి, పుణ్యాహవాచనం వంటి వైదిక కార్యక్రమాలను నిర్వహించి ఆ తర్వాత భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ సమయంలో భక్తులు వేచి ఉండాల్సి వస్తుందని టీటీడీ అధికారులు ముందే సమాచారం అందించారు. గ్రహణ సమయాల్లో ఆలయాలను మూసివేసి సంప్రోక్షణ అనంతరం తిరిగి తెరవడం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ నేపథ్యంలో తిరుమల పుణ్యక్షేత్రంలోని దర్శన వేళల్లో అధికారులు కీలక మార్పులు చేశారు. ఇక గ్రహణం కారణంగా దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఆలయాల మూసివేత సమయాలను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
إرسال تعليق