ఆంధ్రప్రదేశ్ లో ఎల్పీజీ సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 14 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో గ్యాస్ కొరత వస్తుందని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. రాబోయే 15 రోజులకు సరిపడా నిల్వలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని సీఎం వెల్లడించారు. పానిక్ బుకింగ్స్ చేయకుండా ప్రశాంతంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్యాస్ పంపిణీలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యంగా ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు ప్రాధాన్యత ఇచ్చి సరఫరాను మెరుగుపరచాలని సూచించారు. గ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ నిల్వలను పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనివల్ల అత్యవసర సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్యాస్ కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచి డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ-కేవైసీ, ఓటీపీ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. కృష్ణా-గోదావరి బేసిన్ నుంచి లభించే సహజ వాయువును నేరుగా పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే అంశంపై దృష్టి పెట్టాలని అధికారులను కోరారు. సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్ వినియోగాన్ని పెంచడం వల్ల భవిష్యత్తులో ఇంధన కష్టాలు తప్పుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. దీనివల్ల సామాన్యులకు తక్కువ ధరకే గ్యాస్ లభించడంతో పాటు సరఫరాలో పారదర్శకత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎల్పీజీ నిల్వల పై చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష : రాబోయే 15 రోజులకు సరిపడా నిల్వలు సిద్ధం
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق