తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పలువురు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనర్సింహ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఖర్గే చర్చించారు. అలాగే రెండేళ్ల రాష్ట్ర ప్రభుత్వంపై రెండు గంటలపాటు సమీక్ష నిర్వహించారు. అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల్లో మెజారిటీ హామీలు అమలు చేశామన్నారు. తమ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల సమయం ఉందని, హామీలన్నీ అమలు చేసి శభాష్ అనిపించుకుని మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో రూ.8 లక్షల కోట్లు అప్పుపెట్టారంటూ ఉన్న బడ్జెట్‌లో పథకాలన్నింటినీ చాకచక్యంగా అమలు చేస్తున్నామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మంత్రివర్గాన్ని హై కమాండ్ అభినందించిందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధివిధానాలను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారన్నారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థాయిలో ఉందని, మిగతా పంటలను ప్రోత్సహించాలని ఖర్గే చెప్పారని అన్నారు. రాష్ట్ర మంత్రుల అభిప్రాయాలను పెద్దలు విన్నారని, అన్ని అంశాలపై తమకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. మార్చి మొదటి వారంలో నామినేటెడ్ పదవులను, 15 కల్లా పార్టీ పదవులను భర్తీ చేస్తామని మహేశ్ కుమార్ చెప్పారు. అన్ని గ్యారెంటీలను అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికలపై రెండుమూడు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డిని, తనని పిలిచి మాట్లాడతామని ఖర్గే అన్నట్లు మహేష్‌కుమార్ తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగలేదన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం చర్చకు వచ్చిందని, త్వరలోనే ఆయన్ను పిలిచి అధిష్టానం పెద్దలు మాట్లాడతామన్నారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో 80శాతం మంది ప్రజలు కాంగ్రెస్‌ని ఆశీర్వదించారన్నారు. రాజకీయంగా, ప్రభుత్వపరంగా అన్ని అంశాలనూ రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారని తెలిపారు. మేడారం జాతరను ఘనంగా నిర్వహించడం పట్ల అగ్రనేతలు మంత్రి సీతక్కను అభినందించారు. ఆదివాసీ అతిపెద్ద జాతర మేడారంపై పది నిమిషాలపాటు చర్చ జరిగింది. జాతర చరిత్ర, ప్రాశస్త్యంపై సీతక్కను ఖర్గే, రాహుల్ గాంధీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమ్మక్క-సారలమ్మల పోరాట గాథను వారు ఆసక్తిగా విన్నారు. సమ్మక్క-సారలమ్మల చరిత్రను దేశవ్యాప్తంగా చాటేలా సినిమా తీయాలని రాహుల్ గాంధీ సూచించారు. మేడారం జాతరకు ఆహ్వానిస్తే తాము తప్పక హాజరయ్యేవారమని రాహుల్ గాంధీ అనగా ఆహ్వానిస్తే తాను కూడా తల్లుల దర్శనానికి వచ్చే వాడినని ఖర్గే కూడా అన్నారు. సమయాభావం వల్ల వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయినట్లు మంత్రి సీతక్క తెలిపారు. వచ్చే జాతరకు తప్పకుండా అధికారిక ఆహ్వానం అందిస్తామన్నారు. ఆహ్వానం అందితే తప్పక వస్తామని రాహుల్ గాంధీ, ఖర్గే హామీ ఇచ్చారు.

Post a Comment

أحدث أقدم