నైజీరియాలోని జంఫారా రాష్ట్రంలో సాయుధ మూకలు జరిపిన దాడుల్లో దాదాపు 200 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ దళాలు జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ ముష్కర మూకలు ఈ ఘాతుకానికి ఒడిగట్టాయి. అంతకుముందు సైనిక దళాలు అడవుల్లో జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 100 మందికి పైగా సాయుధులు మరణించారు. దీనికి ప్రతీకారంగా బందిపోట్లు గ్రామాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. భారీ ఆయుధాలతో దాదాపు 300 మందికి పైగా దుండగులు మోటారు సైకిళ్లపై వచ్చి ఎనిమిది గ్రామాల్లో మారణకాండ సృష్టించారు. ఇళ్లను దహనం చేయడంతో పాటు ఎదురుపడిన వారిని విచక్షణారహితంగా కాల్చిచంపారు. ఈ దాడుల క్రమంలో వేలాది పశువులను వారు ఎత్తుకెళ్లారు. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. నైజీరియా అధ్యక్షుడు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సాయుధ ముఠాలను 'ఉగ్రవాదులు'గా ప్రకటిస్తూ వారిని అణచివేసేందుకు వెనకాడబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిరంతరం జరుగుతున్న ఈ దాడుల వల్ల వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. నైజీరియాలో గడిచిన కొన్నేళ్లుగా వనరుల కోసం, ఆధిపత్యం కోసం సామాన్యులపై సాయుధ ముఠాలు ఇలాంటి దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. ఈ ఘటన అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది.

Post a Comment

أحدث أقدم