హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ ప్రాంతంలో సుమారు 7 ఎకరాల పార్కులు, ప్రజావసరాల భూములను హైడ్రా శనివారం రక్షించింది. ఈ భూముల విలువ దాదాపు రూ.1400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 78 నుంచి 93 వరకు 1993లో రాజరాజేశ్వరి నగర్ కాలనీ పేరుతో 2059 ప్లాట్లతో గ్రామపంచాయతీ లేఅవుట్ రూపొందించారు. లేఅవుట్ ప్రకారం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 5 ఎకరాలు, పాఠశాలకు దాదాపు ఒక ఎకరం, పార్కులకు మరో ఎకరానికి పైగా స్థలం కేటాయించారు. అయితే పాఠశాల కోసం కేటాయించిన భూమిలో సుమారు 1000 గజాల మేర అపార్ట్‌మెంట్ నిర్మాణం జరిగినట్లు గుర్తించారు. అదే విధంగా కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన 2181 గజాల స్థలంలో ప్రైవేట్ షాపులు, షెడ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పలు షోరూములు, కిరాణా దుకాణాలు, రహదారులు కూడా ఆక్రమణకు గురైనట్లు కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది. యూఎల్సీ భూముల్లో ప్లాట్లు ఎల్ఆర్ఎస్ కిందకి వచ్చినప్పటికీ పార్కులు, ప్రజావసరాల భూములు ఆక్రమణదారుల సొంతంగా మారడం ఎలా జరిగిందని స్థానికులు ప్రశ్నించారు. ఈ భూములు ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని హైడ్రాను కోరారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, లేఅవుట్ ప్రకారం అవి పార్కులు మరియు ప్రజావసరాల భూములేనని నిర్ధారించారు. అనంతరం ఆక్రమణలను తొలగించి భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ప్రజావసరాల భూములను తిరిగి రక్షించడంతో రాజరాజేశ్వరి నగర్‌లో నివసిస్తున్న సుమారు 5 వేల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి.
కొండాపూర్లో రూ.1400 కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق